బుద్ధికొలత వాదం
జగత్తులో స్థలము (space), కాలము (time) అనే రెండు కొలతలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. జగత్తుకు ఈ రెండు కొలతలే కాకుండా బుద్ధి అనేది కొలతగా పనిచేస్తుంది అనే సిద్ధాంతాన్ని బుద్ధికొలతవాదం అని అంటారు. ఈ సిద్ధాంతాన్ని ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు 1975లో ప్రతిపాదించాడు.
నేపథ్యం
[మార్చు]దేవుణ్ణి ఒక ”భావం”గా ”మాయదారి దేవుడు” వ్యాస పరంపరలో కొట్టి పారేసిన కుటుంబరావు "దయ్యాలు లేవని భావించడం ఈ కాలపు మూఢ నమ్మకాలలో ఒకటి” అని మొదటి వ్యాసంలోని మొదటి వ్యాకం లోనే తేల్చి పారేశారు. ఇందులో మొదటి మాటను 1975లో అంటే, రెండవ మాటను 1934లో అన్నారు. ఈ రెండు మాటలనూ ఆయన చాలా "స్పృహ"లో ఉండే అన్నారు. కాకపోతే ఆయన దేవుని గురించి మాట్లాడినప్పుడు ఆయనను సరిగానే అర్ధం చేసుకున్నవారు, అతీతశక్తుల గురించి ఆయన చర్చించినప్పుడు మాత్రం ‘అపార్ధం’ చేసుకున్నారు. అపార్ధాలన్నీ ”బుద్ది కొలత” వాద ప్రతివాదాలలో ప్రతిబింబించాయి. పత్రికాముఖంగా కొ.కుతో వాదనకు దిగదలచుకోని కొందరు మేధావులు మాత్రం ఆయనతో ”బుద్ది కొలత”పై ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు. వారిలో కొందరికి కొ.కు. రాసిన లేఖలు కూడా ఈ ”తాత్విక వ్యాసాలు”లలో చోటుచేసుకున్నాయి.
ఆలివర్ లాడ్జ్ పరిశోధనలతో పాటు గణిత శాస్త్రజ్ఞుడూ, సైన్స్ ఫిక్షన్ రచయితా అయిన ఎడ్విరన్ ఆచాట్ రాసిన ”ప్లాట్‌లాండ్” కూడా కొ.కును ప్రభావితం చేసింది. స్పేస్ అనేదే లేని ఒక విచిత్ర ప్రపంచంలో ”స్థలం”, ”కాలం”అనే ప్రాధమిక కొలతలకు అర్ధం లేకపోవడం ఈ ”ప్లాట్‌లాండ్”లోని విశేషం. కిందటి శతాబ్దం తొలి రోజులలో వెలువడిన ఈ నవల ఐజాక్ అసిమావ్‌తో సహా పెక్కు మంది సౖౖెన్స్ ఫిక్షన్ రచయితలను, శాస్త్రతజ్ఞులను ప్రభావితం చేసింది. కొ.కు. కూడా ఆ ప్రభావంలో స్థల, కాలాలకు తోడు ”బుద్ధి”ని ఒక కొలతగా ప్రతిపాదించారు.మనకు మాములుగా అనుభవంలోకి వచ్చే ఎన్నో అసాధారణ సంఘటనలకు ”బుద్ధి కొలత” లోనే సమాధానం దొరుకుతుందని కొ.కు. విశ్వసించారు. ఆ విశ్వాసానికి శాస్త్రీయ హోదా కల్పించడానికి ఆయన ప్రయత్నించారు.[1]
చరిత్ర
[మార్చు]బుద్ధికొలత వాదాన్ని వివరించడానికి కొ.కు అనేక వ్యాసాలను వ్రాశారు. మొదట ఈ వ్యాసాలు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలలోనూ, ఆంధ్రజ్యోతి వారపత్రికలోను 1973-1978ల మధ్య ప్రచురితమయ్యాయి. ఈ వ్యాసాలను, మరికొన్ని అముద్రితవ్యాసాలను కలిపి (28-12-1973 ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చిన అతీతశక్తులు అనే వ్యాసం మినహా) విశ్వేశ్వరరావు (శ్రీశ్రీప్రింటర్స్) 1983 ఆగస్టులో "బుద్ధికొలత, అసాధారణ అనుభవాలు" అనే పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ వ్యాసాలు ఆంధ్రజ్యోతిలో వెలువడే కాలంలోనూ, తరువాత విశ్వేశ్వరరావు పుస్తకంగా వెలువరించిన తర్వాతా ఈ వ్యాసాలపై అనుకూలంగా, వ్యతిరేకంగా వాద వివాదాలు జరిగాయి. ఇవన్నీ ఆంధ్రజ్యోతి, అరుణతార, సృజన, ప్రజాసాహితి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. సూర్యసాగర్ అనే ఆయన ఈ పుస్తకంపై విమర్శగా "బుద్ధికొలతవాదం - ఒక పరిశీలన" అనే 84 పేజీల పుస్తకాన్ని 1985లో ప్రచురించారు. డిసెంబరు 2012లో ఆంధ్రజ్యోతి వివిధలో రంగనాయకమ్మ కొ.కు బుద్ధికొలత వాదం వ్యాసాలను విమర్శిస్తూ ఒక వ్యాసం వ్రాసారు. దానిపై ఒక మూడునెలలు వివిధలో కడియాల రామమోహన రాయ్, చలసాని ప్రసాద్, కృష్ణాబాయి మొదలైన వారు ఈ చర్చలో స్పందించారు.
మూలాలు
[మార్చు]- ↑ (ఆదివారం ఆంధ్రజ్యోతి 5 డిసెంబర్ 2004)