భూమి-నుండి-భూమికి క్షిపణి
భూమి-నుండి-భూమికి ప్రయోగించే క్షిపణి నేలపై నుండిగానీ, సముద్రంపై నుండి గానీ ప్రయోగింపబడి, నేలపైగానీ, సముద్రంపై గానీ ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడుతుంది. వీటిని చేతితో పట్టుకుని గానీ, వాహనంపై ఉంచి గానీ, స్థావరాల నుండి గానీ, నౌకలనుండి గానీ ప్రయోగించవచ్చు. వీటిని రాకెట్ ఇంజనుతో గానీ, పేలుడు పదార్థం వలన గానీ, ముందుకు తోస్తారు. గాలిలో ప్రయాణిస్తూండగా లిఫ్టు కలిగించడం కోసం, స్థిరత్వం కలిగించడం కోసం వీటికి మొప్పలుగానీ, రెక్కలుగానీ ఉంటాయి. హైపర్ వేగాలతో ప్రయాణించే క్షిపణులు, తక్కువ పరిధి గల క్షిపణులు బాడీలిఫ్టును వాడుకుంటాయి లేదా అవి బాలిస్టిక్ పథంలో ప్రయాణిస్తాయి. వి-1 ప్లయింగ్ బాంబ్ మొట్ట మొదటి భూమి-నుండి-భూమికి క్షిపణి.
ప్రస్తుతం ఉన్న భూమి-నుండి-భూమికి క్షిపణులకు సాధారణంగా దిశానిర్దేశకత్వం ఉంటుంది. దిశానిర్దేశకత్వం లేని భూమి-నుండి-భూమికి క్షిపణిని రాకెట్ అంటారు.( ఉదాహరణకు RPG-7 లేదా M72 LAW ట్యాంకు వ్యతిరేక రాకెట్ కాగా, BGM-71 TOW లేదా AT-2 Swatter ట్యాంకు వ్యతిరేక గైడెడ్ క్షిపణి).
రకాలు
[మార్చు]భూమి-నుండి-భూమికి క్షిపణులను వివిధ రకాలుగా విభజించవచ్చు:
- బాలిస్టిక్ క్షిపణులు: ఇవి బాలిస్టిక్ పథంలో ప్రయాణిస్తాయి. క్షిపణి ప్రయాణంలో ఇంజను కొంత దూరం పాటు మండి, తరువాత ఆగిపోతుంది. ఆ తరువాత క్షిపణి ఇంజను శక్తి లేకుండా, స్వేచ్ఛగా ప్రయాణిస్తుంది.
- వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి: పరిధి 150 కిమీ నుండి 300 కిమీ
- యుద్ధభూమి పరిధి బాలిస్టిక్ క్షిపణి (BRBM): పరిధి 200 కిమీ కంటే తక్కువ
- థియేటర్ బాలిస్టిక్ క్షిపణి (TBM): పరిధి 300 కిమీ నుండి 3,500 కిమీ
- తక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణి (SRBM): పరిధి 1000 కిమీ లేదా తక్కువ
- మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి (MRBM): పరిధి 1000 కిమీ నుండి 3500 కిమీ
- మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి (IRBM) లేదా దూర పరిధి బాలిస్టిక్ క్షిపణి (LRBM): పరిధి 3500 కిమీ నుండి 5500 కిమీ
- ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM): పరిధి 5500 కిమీ కి పైన
- జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (SLBM): బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల (SSBNs), నుండి ప్రయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న క్షిపణులన్నిటికీ ఖండాంతర పరిధి ఉంది.
- వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి: పరిధి 150 కిమీ నుండి 300 కిమీ
- క్రూయిజ్ క్షిపణి: భూమికి దగ్గరగా ప్రయాణిస్తుంది. ప్రయాణం మొత్తం కూడా మోటారు పనిచేస్తూనే ఉంటుంది. దీని పరిధి 2,500 కిమీ వరకు
- ట్యాంకు వ్యతిరేక గైడెడ్ క్షిపణి: భూమికి దగ్గరగా ప్రయాణిస్తుంది. ప్రయాణ దూరం మొత్తంలో మోటారు పనిచెయ్యవచ్చు, చెయ్యకపోనూ వచ్చు. దీని పరిధి 5 కిమీ
- నౌకా వ్యతిరేక క్షిపణులు: నేలకు/నీటికి దగ్గరగా ప్రయాణిస్తాయి. కొన్ని క్షిపణులు లక్ష్యిత నౌకను కొట్టే ముందు ఒక్క సారి మలుపు తీసుకుంటాయి. పరిధి 130 కిమీ
క్షిపణుల పరిధిని వివిధ వర్గాలు వివిధ రకాలుగా నిర్వచిస్తాయి. ఉదాహరణకు, అమెరికా దూర పరిధిని అసలే నిర్వచించదు. వారి నిర్వచనం ప్రకారం 5,500 కిమీ లేదా అంతకంటే ఎక్కువ పరిధి కలిగినవన్నీ ఖండాంతర క్షిపణులే.