అనంతాచార్యులు
అనంతాచార్యులు వేంకటేశ్వరస్వామికి ప్రియభక్తునిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. అనంతాచార్యునికే ఆనందాళ్వార్ అని మరొక పేరుంది. ఆనందాళ్వార్ పేరు మీదుగా తిరుమలలోని ఆనందాళ్వార్ తోట ఏర్పడింది.
తిరుమల ప్రవేశం
[మార్చు]రామానుజాచార్యులు తిరుమలలోని ఆలయ వ్యవస్థలను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించిన కాలంలో తిరుమల కొండపై పూల తోటలు బాగా తక్కువగా ఉండేవి. వేంకటేశ్వరస్వామి అలంకారప్రియుడు కావడంతో పరంపరానుగతంగా ఆయన అలంకారంలో పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూదోటలు తక్కువ ఉండడంతో స్వామి అలంకరణలో పూలకొరత వేధించేది. దాన్ని రామానుజులు తీర్చే ప్రయత్నం చేశారు. తన శిష్యులతో తిరుమలపై నివాసం ఉంటూ పుష్పకైంకర్యం కోసం ఎవరైనా పనిచేస్తారా అంటూ ప్రశ్నించారు. కొండమీద ఆవాసం రామానుజుల కాలంలో చాలా కష్టమైన పని. బాగా చలిప్రదేశం కావడం, దోమలు, విషజ్వరాల బాధ ఉండడం వంటి కారణాలతో ఎవరూ ముందుకు రాలేదు. రామానుజుని శిష్యులలో ఒకరైన అనంతాచార్యులు మాత్రం ఆ సేవను అదృష్టంగా భావించి కొండకు పోయేందుకు సిద్ధమయ్యారు.[1]
శ్రీవారికి గునపం దెబ్బ
[మార్చు]కొండమీదికి వచ్చిన అనంతాచార్యులు ఎంతో కష్టపడి నందనవనాన్ని అభివృద్ధి చేశారు. అంతటి వనాన్ని పెంచడానికి నీరు కావాల్సి ఉంటుంది కనుక సరోవరం లాంటి పెద్ద బావి తవ్వేందుకు సంకల్పించారు. ఆ పనిలో గర్భవతియైన భార్య, చిన్న కుమారుడు కూడా అవస్థపడుతూ సాయం చేయడంతో స్వామివారు స్వయంగా మారువేషం ధరించి సహకరించే ప్రయత్నం చేశారు. స్వామి వారి కైంకర్యంలో ఇతరుల సహకారం ఎందుకు అనుకుని వ్యతిరేకించగా, స్వామివారు లీలగా ఆలయం వైపు పరుగెత్తారు. అనుమానించిన అనంతాచార్యులు తన చేతిలో ఉన్న గునపాన్ని స్వామివారిపైకి విసిరారు. ఆ వ్యక్తి(వేంకటేశ్వరుడు) ఆలయంలోకి మాయమయ్యారట. వేంకటేశ్వరుని విగ్రహం చుబుకానికి(గడ్డం) రక్తం కారడంతో వచ్చినవారు వేంకటేశ్వరుడనే విషయం స్పష్టమైందట. తాను వేంకటేశుని కొట్టానని ఆయన ఎంతో విలపించారు. అర్చకులు గాయానికి పుప్పొడి అద్ది ఉపశమనం చేశారు. అనంతాచార్యుని బాధ గమనించి భగవంతుడే బుజ్జగించి ఆ గాయపు గుర్తును శ్రీవత్స చిహ్నంగా భావిస్తానని, తనకు గాయమైన చోట పచ్చకర్పూరం అద్దే వుంచాలని తద్వారా అనంతాచార్యుల భక్తి అందరికీ తెలుస్తుందని శాసించినట్టు చెప్తారు.[2]
పద్మావతిని కట్టివేయడం
[మార్చు]అనంతాచార్యుల భక్తిని లోకానికి వెల్లడించడానికి శ్రీనివాసుడే పద్మావతీదేవితో కలిసి రాకుమారుడు, రాకుమార్తె వేషాలు ధరించి అనంతాచార్యులు పెంచుతున్న పూదోటలో పూలమొక్కలను చెల్లాచెదరు చేసి అంతా చిందరవందర చేసేవారట. అనంతాచార్యులు అలా ఎవరుచేస్తున్నారో తెలుసుకోలేక ఒక పొదరింట్లో కాపువేశారట. తోట పాడుచేస్తున్న రాజదంపతులను పట్టుకుని సంపెంగ చెట్టుకు కట్టేస్తుండగా శ్రీనివాసుడు తప్పించుకుంటాడు. దొరికిపోయిన పద్మావతీదేవిని స్వామి కైంకర్యానికి ఉపయోగించాల్సిన పూలమొక్కలు పాడుచేస్తున్నారనే కోపంతో అనంతాచార్యులు సంపంగి చెట్టుకు కట్టేస్తారు. నేను నీ కూతురులాంటి దాన్ని. విడిచిపెట్టు అని కోరినా వదలడు. ఉదయం అర్చకులు ఆలయం తలుపులు తెరచి చూస్తే స్వామివారి వక్షఃస్థలంలో ఉండాల్సిన అమ్మవారు లేరని గమనిస్తారు. అర్చకుల్లో ఒకరికి ఆవహించి స్వామివారు జరిగిన విషయం చెప్తారు. జరిగింది తెలుసుకున్న అనంతాచార్యులు అమ్మవారిని పెళ్ళిపూలబుట్టలో కూర్చోపెట్టి, నెత్తినపెట్టుకుని మోస్తూ ఆలయానికి తీసుకువెళ్ళారట. క్షమాపణ చెప్తున్న అనంతాచార్యులతో నీ పుత్రికను నాకు ఇవ్వు అని అడిగి కంఠంలోని ఒక పూమాలను అనంతాచార్యుని మెళ్ళో వేసి అనుగ్రహించారు స్వామివారు.[3]
తిరుమల తొలి ఆచార్య పురుషుడు
[మార్చు]రామానుజాచార్యులు తిరుమల ఆలయంలో కైంకర్యాల విషయంలో లోపం లేకుండా ఏకాంగి వ్యవస్థ, యతీంద్ర వ్యవస్థ ఏర్పాటుచేశారు. వీరు ఎంత పాండిత్యం కలవారైనా-ఆలయాధికారులకు, అర్చకస్వాములకు శాస్త్రీయ ధర్మ మర్యాదల్లో, కైంకర్య విషయాల్లో లోపం కలగకుండా ఉండాలని ఆచార్య పురుష వ్యవస్థను ఏర్పాటుచేశారు. శాస్త్రీయ ధర్మ మర్యాద స్థాపన అనే పద్ధతికి నాంది పలుకుతూ అనంతాచార్యుని తొలి ఆచార్య పురుషునిగా నియమించారు. వేదసంపన్నుడు, విష్ణుభక్తుడు, మత్సరం లేనివాడు, మంత్రాలు తెలిసి వాటిపై శ్రద్ధ గలవాడు, కోరికలులేనివాడు, బ్రాహ్మణుడు వంటి ఎన్నో లక్షణాలు ఉండాల్సినందున అటువంటివాడిగా ఎంచి అనంతాచార్యుని ఆచార్య పురుషునిగా నియమించారు. అన్ని ఆలయ మర్యాదల్లో ముందు మర్యాద వారికి అందేలా చేశారు. మొదటి శఠారి, మొదటి తీర్థం, తొలి దర్శనం వంటివి వారికే ఇచ్చేలా ఏర్పాటు జరిగింది. ఆలయంలోని అర్చకులు, ఇతర వైదిక సేవల వారి గుణగణాలు, సమర్థత, తత్పరత వంటివి సరిజూసే బాధ్యతలు ఆచార్య పురుషునిగా ఆయనకు లభించింది.[4]
తిరుమల చరిత్ర రచన
[మార్చు]అనంతాచార్యులు సంస్కృతంలో వేంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం రచించారు. చారిత్రికాధారాలు నిక్షిప్తం చేసిన ఈ గ్రంథాన్ని తిరుమలలోని వ్యవస్థల ఆవిర్భావం, నిర్దుష్టత వంటి విషయాల కోసం, తిరుమల చరిత్ర కోసం సంప్రదిస్తూంటారు. అయితే కొందరు చరిత్రకారులు మాత్రం ఈ గ్రంథాన్ని పూర్తిగా ప్రమాణంగా స్వీకరించరు.[5]
పారంపర్యం
[మార్చు]- అనంతాచార్యులను శ్రీనివాసుని మామగారు అంటూ గౌరవిస్తారు. ఆయనను రామానుజులు తొలి ఆచార్యపురుషునిగా చేయగా వంశస్థులకు పరంపరానుగతంగా ఆ గౌరవం దక్కుతోంది. ఇప్పటికీ ఆయన వంశస్థులను ఆచార్య పురుషులుగా గౌరవిస్తున్నారు.[3]
- అనంతాచార్యులకు వేంకటేశ్వరుడు మాట ఇచ్చినట్టు చెప్పే ఐతిహ్యం ప్రకారమే ఇప్పటికీ స్వామివారి చుబుకానికి శ్రీవత్స చిహ్నంతో అలంకరిస్తారు. అనంతాచార్యులు విసిరిన గునపం దెబ్బ తగిలిన చోట పచ్చ కర్పూరం అద్ది చిన్న మచ్చ పెడతారు.[2]
- స్వామివారిపై అనంతాచార్యులు విసిరిన గునపాన్ని తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో ప్రదర్శిస్తున్నారు. ఆలయంలో మహాద్వారం గడపకి కుడివైపు గోడకి వేలాడదీసి ఉంటుంది. వివరాలను తెలుపుతూండే బోర్డు కూడా అక్కడే వేలాడదీసి ఉంటుంది.[3]
- స్వామివారు రాకుమారుడిగా ఆనందాళ్వార్ తోటలో పద్మావతీదేవిని విడిచి అప్రదక్షిణంగా ఆలయానికి పారిపోయారని ప్రతీతి. అందుకే బ్రహ్మోత్సవాల చివరిలో స్వామివారిని అప్రదక్షిణంగా ఆనందాళ్వార్ తోటకు తీసుకువెళ్ళి హడావుడిగా పరుగుపరుగున మళ్ళీ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్ట్ 2013:పేజీ.73
- ↑ 2.0 2.1 తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్ట్ 2013:పేజీ.74
- ↑ 3.0 3.1 3.2 3.3 తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్ట్ 2013:పేజీ.75
- ↑ తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్ట్ 2013:పేజీ.82
- ↑ తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్ట్ 2013:పేజీ.85