తిరుమల తోమాల సేవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తోమాల సేవ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమం. శ్రీనివాసునికి జరిపే తిరుమంజన కార్యక్రమం, ప్రబంధ పారాయణం, పుష్పాలంకరణ, పూజాది కార్యక్రమాలు తోమాల సేవలో భాగము.

తోమాల - అనే పదం 'తొడుత్తమాలై' అనే తమిళ పదానికి సంక్షిప్త రూపం. అంటే 'పూవుల మాల' అని అర్ధం. మూలవిరాట్టునకు అలంకరించిన బంగారు కవచాలకు, భోగ శ్రీనివాసునకు అభిషేకం మంత్రోచ్ఛారణల మధ్య జరుగుతుంది. తరువాత స్వామిని రకరకాల పూల దండలతో అలంకృతుని గావిస్తారు. అందుకే ఈ సేవకు తోమాల సేవ అని పేరు వచ్చింది.

మంత్రాసనం
ఇందులో స్వామికి అర్ఘ్య, పాద్య, ఆచమనాదులకు జలాన్ని సమర్పిస్తారు.
స్నానాసనం
ధ్రువబేరానికి ప్రతిదినం అభిషేకం సాధ్యం కాదు కనుక ఈ కార్యం కౌతుకబేరానికి చేయబడుతున్నది. ధ్రువమూర్తి పవిత్రపాదాల మీది బంగారు తొడుగును వేరుచేసి అభిషేకం చేయడం జరుగుతుంది. భోగ శ్రీనివాసుడు లేదా కౌతుక బేరాన్ని దాని జీవస్థానంనుండి వేరుచేసి, స్నపన పీఠం మీదకు చేరుస్తారు. దుస్తులను ధరింపజేసి, శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేక కార్యక్రమం జరుగుతుంది. నూనె పూయబడుతుంది. తరువాత చింతపండు ముద్దను పట్టించి అది శుభ్రంగా తొలగిపోయేట్లు నీరు పోస్తారు. ఆవుపాలు, పసుపుతో కూడా అభిషేకం జరుపుతారు. అభిషేకం జరిగిన ప్రతిసారి శుద్ధోదక స్నానం జరుపుతారు. కడపట గంధోదక స్నానం, మరల శుద్ధోదక స్నానంతో అభిషేక కార్యక్రమం పూర్తవుతుంది. తరువాత కౌతుకబేరాన్ని పొడి వస్త్రంతో తుడిచి పుష్పాంజలి కావించి, ఆ విగ్రహ జీవస్థానానికి తరలిస్తారు. ధ్రువబేరానికి ప్రోక్షణ గావించిన అనంతరం కౌతుక బేరంతో వీరి మధ్య బంగారు కొక్కెమును తగిలించి సంబంధాన్ని పునరుద్ధరిస్తారు. పూర్తి కార్యక్రమం అంతా అయ్యేవరకు సంబంధించిన మంత్ర పఠనం జరుగుతుంది.
పుష్పన్యాసం
తూర్పు దిశలోని పురుష దేవతతో ప్రారంభించి మొదటి, రెండవ, మూడవ ఆవరణలో దేవతలను పుష్పాలతో పూజ చేయడం జరుగుతుంది. అనంతరం మార్కండేయ, బ్రహ్మ, శివులకు పుష్పపూజ చేస్తారు. తరువాత ద్వార దేవతలకు, ద్వార పాలకులకు, విమాన పాలకులకు మొదలైన వారికి పూజ జరుగుతుంది. గర్భగృహం గడపను శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత అర్చన కార్యక్రమం జరుగుతుంది.
అలంకారాసనం
ఇందులో ఆసనం, వస్త్రం, భుషణం, ఉత్తరీయం సమర్పించబడును. తిలక ధారణగా స్వామికి కర్పూరంతో నుదుట ఊర్ధ్వపుండ్రాన్ని దిద్దడం జరుగుతుంది. తరువాత యజ్ఞోపవీత ధారణ జరుతుతుంది.

మూలాలు

[మార్చు]
  • తిరుమల ఆలయము (ధారా వాహికము-44), ఆంగ్లమూలం: డా.రమేశన్, తెలుగు అనువాదం: డా.కోరాడ రామకృష్ణ, సప్తగిరి మాసపత్రిక జూలై 2006 సంచికలో వ్యాసం.